గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన తనయుడు లోకేష్ నడవనున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించాలని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యోచిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. అదే రోజున పాదయాత్రను ప్రారంభించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని భావించారు. అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్రను ప్రారంభించడం సైకిల్ యాత్రను పక్కన పెట్టారు. చంద్రబాబు పాదయాత్ర కంటే ముందుగానే సైకిల్ యాత్ర చేయాలని లోకేష్ భావించినా అది వర్కవుట్ కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రను విశాఖపట్టణంలో ముగించిన సంగతి తెలిసిందే. రు. ఈ పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన వినతుల ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణ మాఫీ వంటి అంశాలను చంద్రబాబు చేర్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగింది. 2014లో ఉమ్మడిగా ఎన్నికలు కూడా జరిగాయి. అనంతరం ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు సీఎంగా పనిచేసినప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే… ఇప్పుడు జగన్ సీఎంగా వున్నప్పుడు లోకేష్ పాదయాత్రకు నడుం బిగిస్తున్నారు. పాదయాత్ర 2019లో ఏపీలో YCP ని అధికారంలోకి తీసుకు వచ్చింది. లోకేష్ పాదయాత్ర టీడీపీకి వర్కవుట్ అవుతుందా? తాను ఓడిపోయిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో యాత్రకు బ్రేక్ ఇవ్వకూడదని, అప్రతిహతంగా 13 జిల్లాల్లో పాదయాత్ర చేయాలని లోకేష్ కృతనిశ్చయంతో వున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ క్షణమైనా రాష్ట్రంలో ఎన్నికలు రావచ్చనే అంచనాలో ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆరునెలల నుంచే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయకులను, కార్యకర్తలను రెడీచేస్తున్నారు.
రెండు నెలల్లో లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే అవకాశం ఉంది. మంగళగిరి టూర్ పూర్తి కాగానే అక్టోబర్ నుంచి పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. ఏడాది పాటు పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే పాదయాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించే సమయంలో పార్టీ కార్యక్రమాలను లోకేష్ పర్యవేక్షించేవారు. ఈ సమయంలోనే లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా చూసుకొనేవారు. యాత్ర సాగుతున్న తీరు తెన్నులపై పార్టీ నేతలతో చర్చించేవారు. ఆ అనుభవం లోకేష్ కు అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలి? ఏయే నియోజకవర్గాల్లో ముందుకు సాగాలి? రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎక్కడెక్కడ ఆగాలి? ఇలాంటి ప్రతిపాదనలన్నీ సిద్ధమవుతున్నాయి. తర్వాత ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటించవచ్చు. లోకేష్ ఏం మాట్లాడాలి? ఎవరితో ఎలా మెలగాలి? పార్టీ మేనిఫెస్టోలో ఏయే అంశాలు చేర్చాలనేదానిపై టీడీపీలో మేథోమథనం జరుగుతోంది. మహానాడు ఇచ్చిన జోష్ తో కార్యకర్తలు కూడా మంచి ఊపు మీదున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలా వుంటుందనే అంశంపై చంద్రబాబు నేతల అభిప్రాయాలు క్రోడీకరిస్తున్నారు. మరి లోకేష్ పాదయాత్ర ఎంతవరకూ టీడీపీకి కలిసి వస్తుందో చూడాలి.