ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు.
ఈ పోల్‌లో తొలి అంశంగా బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకా అని పెట్టారు. రెండో అంశంగా తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలనా అని పేర్కొన్నారు. మూడో అంశంగా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలనా అని ప్రశ్నించారు. నాలుగో అంశంగా లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలనా? అంటూ నారా లోకేష్ నిలదీశారు. ఈ నాలుగింటిలో దేని కోసం జగన్ ఢిల్లీ వెళ్లారో చెప్పాలని నెటిజన్‌లను నారా లోకేష్ కోరారు.
కాగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న జగన్ రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.

Nara Lokesh Tweet
https://ntvtelugu.com/ap-cm-jagan-will-meet-with-pm-and-central-ministers-in-delhi-tour/