NTV Telugu Site icon

రేపు తిరుపతిలో చంద్రబాబు సతీమణి పర్యటన.. వరద బాధితులకు సాయం

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలతో చాలామంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 20న తిరుపతిలో పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కాగా వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు నారా భువనేశ్వరి ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వెల్లడించింది.

కాగా ఏపీ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల అనంతరం నారా భువనేశ్వరి ఏపీలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో తన భార్యను అవమానించారని చంద్రబాబు కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వ్యాఖ్యలపై వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరోవైపు ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. వరద బాధితులకు అండగా ఉంటామని సీఎం జగన్ కూడా ప్రకటించారు.

Read Also: మరుగుదొడ్లు కడిగిన మంత్రి.. నెటిజన్‌ల ప్రశంసలు