NTV Telugu Site icon

Nallamala Forest: నల్లమల ఫారెస్ట్‌లో తప్పిపోయిన 15 మంది భక్తులు.. డయల్‌ 100కు కాల్‌..

Nallamala Forest

Nallamala Forest

Nallamala Forest: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు.. వీరందరూ బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెంకు చెందిన భక్తులుగా గుర్తించారు అధికారులు.. అయితే, ముందుగా శ్రీశైలం వచ్చిన సదరు భక్తులు.. మల్లన్న స్వామిని దర్శించుకొని, అక్కడ నుండి ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి కాలి నడకన అటవీప్రాంతంలో బయల్దేరారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎటుపోవాలో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు.. కొంతదూరం నడిచినాక ఫోన్‌కు సిగ్నల్‌ రావడంతో డయల్‌ 100 కు కాల్ చేశారు.. ఫారెస్ట్‌లో దారితప్పిన తమను రక్షించాలని.. సహాయం చేయాలని పోలీసులను కోరారు భక్తులు.. ఆ కాల్‌లో అలర్ట్‌ అయిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు.. శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయం వద్ద అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు 15 మంది భక్తులను సురక్షితంగా రక్షించి పోలీసుల వాహనంలో అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు. దీంతో భక్తులు.. వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి క్యూ కట్టిన కార్పొరేటర్లు..!