Site icon NTV Telugu

Nadendla Manohar: బటన్ నొక్కడానికి బారికేడ్లు అవసరమా?

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. కుప్పంలో శుక్రవారం నాడు జగన్ పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. కుప్పంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ చర్యలను ఉద్దేశిస్తూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా అని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. మీకు రోడ్లు వేయడం రాదు కానీ… రోడ్లు తవ్వేసి బారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ మేరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా అటు కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు శుక్రవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన శ్రీనివాసులు, రాజ్ కుమార్, మునుస్వామిలతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఏడుగురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున బాండ్, ఇద్దరేసి వ్యక్తుల పూచీకత్తులు సమర్పించి బెయిల్ పొందవచ్చని హైకోర్టు పేర్కొంది.

Exit mobile version