ఏపీలో వరుసగా ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే బాదుడే బాదుడు అంటే విపక్షాలు నిరసనలకు దిగాయి. ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు.. ప్రజలను బాదే ప్రభుత్వం అన్నారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు?
ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70 వేల మంది ప్రయాణిస్తుండగా, పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. డీజిల్ సెస్ పేరుతో టికెట్ ధరలు పెంచుతూ ప్రయాణీకులపై భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా పేదలను ఇబ్బంది పెట్టేదే. డీజిల్ ధర పెరగటం వల్లే టికెట్ ధర పెంచాల్సి వచ్చిందని చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నులో రాయితీ ఇచ్చి ఆర్టీసీపై భారం తగ్గిస్తే టికెట్ ధర పెంచాల్సిన అవసరం ఉండదు.
Read Also: KGF 2 : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు… గంటల్లోనే 40 లక్షలు !
తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తోంది.అలాంటి పథకం ఏదీ మన రాష్ట్రంలో లేదు.ఇక్కడ భారం మోపి బాదటం తప్ప ప్రయాణీకుల సంక్షేమం గురించి పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి డీజిల్ భారం ప్రభుత్వమే భరించి సెస్ విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఆస్తి పన్ను పెంచారు. చెత్త పన్ను వేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ టికెట్ ధరలు పెంచారు. రేపటి రోజున ఇంకేం పెంచుతారోననే భయంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.
