NTV Telugu Site icon

Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?

Crime

Crime

ఆటో బేరం వచ్చిందని ఒక వ్యక్తి సంతోషంగా వెళ్లాడు.. అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు.. ఒక రోజంతా చూశారు.. అయినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సరిగ్గా నాలుగు రోజులకు అదే వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. అందునా దారుణంగా హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అసలు ఆ చెరువు వద్దకు ఎందుకొచ్చాడు.. ఆ యువకుని చావుకు చేతబడికి ఏమైనా సంబంధం ఉందా.. ఇదే ఆ హత్య కేసులో అసలైన మిస్టరీ.. ఆ యువకుని చావుకు కారణాలేంటి? అనంతలో సంచలనం కలిగించిన సంఘటన ఇది.

టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. ప్రజలను ఇంకా మూఢ విశ్వాసాలు వీడటం లేదు.. ఆకాశంలోకి రాకెట్ల పంపి ప్రయోగాలు చేస్తున్నా.. ఇంకా క్షుద్ర పూజలు, చేతబడులు అంటూ జనం అంధకారంలో ఉంటున్నారు. వారు అంధకారంలో ఉండటమే కాదు.. ఆ విశ్వాసాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మనుషులు ఇంకా ఎంత అంథ విశ్వాసంలో ఉన్నారో తెలియజేస్తోంది. .. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం చెరువులో ఒక మృత దేహం కనిపించింది. బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. మృతదేహం గుర్తు పట్టలేని పరిస్థితులో ఉంది.కానీ అప్పటికే మిస్సింగ్ కేసులో ఉన్న ఒక వ్యక్తి పొలికలకు ఇది సరిపోయింది. దీంతో ఆ వ్యక్తి బంధువులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు అది చూసి ఘొల్లుమన్నారు.

ఈ మృతదేహం ఎస్కే యూనివర్శిటీ సమీపంలో ఉండే నాగేశ్వరనాయక్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఎక్కడో ఆకుతోటపల్లిలో ఉండాల్సిన వ్యక్తి ఇంతదూరం ఎలా వచ్చాడని ఆరా తీస్తే దాని వెనుక చాలా దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన నాగేశ్వర నాయక్ స్వగ్రామం కదిరి మండలం ఏటిగడ్డపల్లి తండా. అయితే ఏడాది క్రితం ఆకుతోటపల్లికి వచ్చి.. నివాసముంటున్నాడు. ఏడునెలల కిందట నాగేశ్వర్‌ నాయక్ కు ప్రియాంకతో వివాహమైంది. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు బాలమ్మ, నారాయణస్వామినాయక్ స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే ఈనెల 25న ఆటో బాడుగ ఉందని.. ధర్మవరం వెళ్లాలని భార్యకు చెప్పి వెళ్లాడు.. అంతే అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. ఇలా శవమై కనిపించాడు. తన కుమారుడిని ఏటిగడ్డ తండాకు చెందిన కృష్ణానాయక్ చంపించాడని తండ్రి నారాయణస్వామి నాయక్ ఆరోపించాడు. పోలీసులు దీనిపై ఫిర్యాదు అందుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

అసలు నాగేశ్వరనాయక్ ను ఎవరు చంపారు.. ఎందుకు చంపారంటే..? దీని వెనక ఇంకో దారుణమయిన కథ ఉంది. కదిరి మండలం ఏటిగడ్డ తండాకు చెందిన కిరణ్ అనే 15 ఏళ్ల బాలుడు ఏడాది క్రితం మృతిచెందాడు. ప్రస్తుతం హత్యకు గురైన నాగేశ్వర నాయక్ తల్లి బాలమ్మ అనే మహిళ చేతబడి చేయడం వల్లే తన కుమారుడు కిరణ్ మృతి చెందాడని గొడవలు జరిగాయి. గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. చేతబడి ఆరోపణ రావడంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్, కుమారుడు నాగేశ్వర్ నాయక్ ఊరు నుంచి వెళ్లిపోయారు. ఆకుతోటపల్లిలో నివాసం ఉంటున్నారు.

ఎన్ని రోజులు ఇలా ఊరు కాని ఊర్లో ఉంటామని పెద్ద మనుషుల జోక్యంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్ స్వగ్రామానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. తన కుమారుడు కిరణ్ మృతికి చేతబడే కారణమనే అనుమానం పెంచుకున్న కృష్ణానాయక్ బాలమ్మ కుమారుడు నాగేశ్వర్ నాయక్ ను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 25న ధర్మవరంలో ఆటో బాడుగ ఉందని నాగేశ్వర్‌ నాయక్‌కు చెప్పి అనంతపురం నుంచి ధర్మవరం తీసుకొచ్చాడు. పట్టణ సమీపంలోని చెరువుకట్ట మూడో మరువ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న కృష్ణానాయక్ ఆయన స్నేహితులు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చేతబడి చేసి తన కుమారున్ని చంపారన్న కారణంతో.. ఈ యువకున్ని హత్య చేశారు. పెళ్లై ఏడు నెలల కూడా గడవక ముందే ప్రియాంక పరిస్థితి ఇలా అయింది. అసలు ఈ కాలంలో కూడా చేతబడులు సాధ్యమా? ఇలాంటి దురాచారాలతో మరో వ్యక్తిని బలితీసుకోవడం ఏంటి?

Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..