అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. విజయనగరం జిల్లాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సి.ఇ.ఓ) ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. ఓటరు నమోదు అధికారులు, సహాయ అధికారులతో మన్యం, విజయనగరంజిల్లా కలెక్టర్ కార్యాలయల్లో సమీక్షించారు సీఈఓ. మన్యంజిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ప్రాథమిక పాఠశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఓటరు జాబితా పక్కాగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.
Read Also: Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్ చోరీ.. స్పందించిన రైల్వేశాఖ
ప్రస్తుత ఓటరు ముసాయిదా, అభ్యంతరాల తీరుని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. మన్యం, విజయనగరం జిల్లా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాం అన్నారు. ప్రస్తుతం యువ ఓటర్లు, నిరాశ్రయులు, గిరిజనుల ఓటు నమోదుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. 18-19 ఏళ్లు ఓటర్లు నమోదు పెంచేందుకు అధికారులకు టార్గెట్ పెట్టాం. ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు పెంచాం. గిరిజనులకు సంబంధించిన అన్ని తెగల వారు తప్పకుండా ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం అన్నారు. ఈ ప్రక్రియ మన్యం, విజయనగరం జిల్లాలో సంతృప్తికంగా ఉందన్నారు.
అక్టోబర్ 1, 2023 వరకు 18 సంవత్సరాలు పూర్తయ్యేవారు ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే నమోదైన ఓటర్లు మార్పు చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. కొత్తవారు ఫారం-6లో వివరాలు నింపాలి. దరఖాస్తుకు పదో తరగతి మార్కుల మెమోతోపాటు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా జతచేయాలి.ఎవరైతే జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1, 2023 వరకు 18 ఏండ్లు నిండినవారై ఉంటే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకొని తప్పులను సరిచేయించుకోవచ్చు. మీ సేవ ద్వారా కూడా ఓటరు గుర్తింపు కార్డుకై దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌తోపాటు ఫారం-6లో వివరాలను రాసి సంబంధిత మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలోగాని, బూత్‌స్థాయి అధికారులకుగాని అందజేయొచ్చు. మరణించిన లేదా శాశ్వతంగా నివాసం మార్చిన వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించుటకు ఫారం-7 పూరించి దాఖలు చేయాలి. ఓటరు జాబితాలో మీ పేరు సవరించుకునేందుకు ఫారం-8లో మీ ఈపీఐసీ నంబర్‌ను పేర్కొంటూ క్లెయిమ్ పత్రాన్ని దాఖలు చేయాలి. మీరు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం మార్చుకున్నట్లయితే ఫారం-8ఏలో పాత చిరునామాతోపాటు ప్రస్తుత చిరునామాను పేర్కొంటూ సవరణ పత్రాన్ని ఆన్‌లైన్‌తోపాటు నేరుగా సంబంధిత బీఎల్‌వోలకు అందజేయవచ్చు. మీరు మీ నివాసాన్ని కొత్త నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లయితే మళ్లీ తాజాగా ఫారం-6 దాఖలు చేసి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also: OTT Updates: బంపర్ ఆఫర్.. భారీ ధరకు ‘గాలోడు’ మూవీ ఓటీటీ హక్కులు