తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… ఇప్పటికే పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సీఎం వైఎస్ జగన్ వరకు లేఖలు రాస్తున్న ముద్రగడ.. ఈ సారి రైతుల సమస్యలను పేర్కొంటు ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాశారు.. ఇటీవల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోచిందని.. తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందని లేఖలో పేర్కొన్న ఆయన.. జిల్లాకు ఒకటి చొప్పున ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తీసే డిస్టిలరీ ఏర్పాటు కావాలని.. తద్వారా ధాన్యం తడిచినా రైతులకు మద్దతు ధర వస్తుందన్నారు.
Read Also: కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు
ఇక, నేను మంత్రిగా పని చేసిన సమయంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయని ఈ బహిరంగ లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం… ఇరువురు ముఖ్యమంత్రులు ధాన్యం నుంచి స్పిరిట్ తయారు చేసే డిస్టిలరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే రైతులకు నష్టాలు రావన్న ఆయన… వరి వద్దనీ వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.. నీరు అధికంగా ఉండే భూముల్లో వరి తప్ప వాణిజ్య పంటలకు అస్కారం ఉండదని సీఎంల దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఈ వైపుగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.. దీంతో.. వివిధ మార్కెట్లలో రైతులు ధాన్యం బస్తాలతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.. ఇక, కొన్ని చోట్ల కల్లాలు, రోడ్లపై కూడా వరి ధాన్యం దర్శనమిస్తోంది.. చాలా ప్రాంతాల్లో వర్షాలతో వది ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.