NTV Telugu Site icon

సికింద్రాబాద్‌కు ర‌ఘురామ‌… సొంత కారులోనే..

MP raghu Rama

గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రికి బ‌య‌ల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల త‌ర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయ‌న‌ను ఎప్పుడు త‌ర‌లిస్తార‌ని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక‌, ర‌ఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్ప‌ష్టం చేశారు సీఎస్.. ఆ త‌ర్వాత ఎస్కార్ట్ పోలీసులు.. అరండల్ పేట పోలీసులు జైలు ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అయితే, ఎంపీ రఘురామను ఆయ‌న‌ సొంత వాహనంలో తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు న్యాయ‌వాదులు.. దీనికి పోలీసులు అంగీకారం తెల‌ప‌డంతో.. ఆ త‌ర్వాత గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌కు బ‌య‌ల్దేరారు..

కాగా, రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఇక‌, ఈ స‌మ‌యంలో ర‌ఘురామ జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న‌ట్టుగా భావించాల‌ని సూచించింది.. తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియ‌ల్ అధికారిని నామినేట్ చేస్తుంద‌న్న సుప్రీంకోర్టు.. ఆ జ్యుడీషియ‌ల్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటూ.. ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయాల‌ని.. వైద్య ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.. ఇక‌, వైద్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చును మొత్తం ర‌ఘురామ‌కృష్ణం రాజే భ‌రించాల‌ని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే, ఇప్ప‌టికే ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితి, గాయాల‌పై జీజీహెచ్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి వైద్యులు కోర్టుకు నివేదిక ఇవ్వ‌గా.. ఇప్పుడు ఆర్మీ ఆస్ప‌త్రిలో నివేదిక ఎలా ఉండ‌బోతోంది అనే ఉత్కంఠ నెల‌కొంది.