NTV Telugu Site icon

GVL Narasimha Rao: విశాఖ, ఇతర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాలి

Gvl Narasimha

Gvl Narasimha

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 5G సేవల కోసం విశాఖపట్నం యొక్క వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో వివరించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి రాసిన లేఖలో, దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు వారికి మరియు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియ చేశారు.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్

అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ యొక్క 5G టెక్నాలజీ డిజిటల్ మరియు ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు జీవీఎల్. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం మరియు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. అతి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ నొక్కిచెప్పారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన ఆర్థిక వృద్ధిని కలుగ చేసే ఇంజిన్ వంటిదని ఎంపి తెలియచేశారు.

దీంతో పాటు విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉన్నందున, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉన్నందున విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక మరియు ముఖ్యమైన ప్రాంతమని ఎంపీ జీవిఎల్ అన్నారు. ఆర్థిక, వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను లేఖలో అభ్యర్థించారు.

Read Also: Chelluboyina Venugopal: భవిష్యత్ తరాలకు మేలు జరగాలి