ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. అయితే, ఇంకా ఆయ భయం నుంచి కొంతమంది బయట పడలేకపోతున్నారా? భయంతో వణికిపోతున్నారా? అంటే అవుననే కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ భయంతో ఇంటికే పరిమితం అయ్యారు ఓ తల్లి, కూతురు.. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది… కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Minister Malla Reddy: ఇది మా కుటుంబ సమస్య.. మేం పరిష్కరించుకుంటాం..!
గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంటికి పరిమితమయ్యారు కుయ్యేరు గ్రామానికి చెందిన తల్లి మణి, కూతరు దుర్గాభవాని.. కరోనా సమయంలో బయటికి రాకూడదు.. బయట అడుగుపెడితే వైరస్ సోకుతుందని భయపడిపోయారు.. అదే భయం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది.. అప్పటినుండి ఇంట్లో ఒక హాల్‌లోనే ఉండిపోయారు ఇద్దరు.. అయితే, వారికి భోజనం అందిస్తూ వస్తున్నాడు మణి భర్త… బయటకు వస్తే కరోనా వస్తుంది అని భయంతో వణికిపోతున్న తల్లి కూతుళ్లు.. కిటికీలోంచి ఎవరైనా మాట్లాడినా దుప్పటి లోపలే ఉండి సమాధానం చెబుతున్నారు.. ఆ ఇద్దరిని చూసి దాదాపు రెండేళ్లు గడిచిందని స్థానికులు చెబుతున్నారు.. అయితే, వారం రోజుల నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.. తండ్రిని కూడా ఇంటిలోపలికి రానివ్వడంలేదు.. మరోవైపు.. తల్లి మణి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.. దీనిపై వైద్యులకు సమాచారం అందించారు.. వైద్య సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా బయటకు రావడానికి నిరాకరిస్తున్నారు. ఓవైపు కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఇంకా ఇలాంటి పరిస్థితి ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.