జగన్ మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. అయితే, ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ కామెంట్లు చేయడం విశేషం.
సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగే వారే నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని భావిస్తున్నాను. వైసీపీలోకి కృష్ణా జిల్లాలో ముందుగా వచ్చింది నేనే. జగన్‌పై సీబీఐ కేసులు పెడితే నేను అండగా నిలబడ్డా. నా తర్వాతే కొడాలి నాని.. ఇప్పుడు మంత్రి అయిన జోగి రమేష్ వచ్చారు. కానీ నాకు అన్యాయం చేశారన్నారు.
సీనియరుగా నాకు మంత్రి పదవి వస్తుందని ఆశించా.. కానీ రాలేదు. నా కార్యకర్తలు బాధపడుతున్నారు. కానీ సంయమనం పాటించాలని సూచిస్తున్నాను. జగన్ నిర్ణయం మేరకు నడుచుకోవడానికి సిద్దంగా ఉన్నా అన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. మంత్రిపదవి రాకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు రాజీనామాలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి బాలినేనిని సముదాయించే పనిలో పడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. బాలినేని నివాసానికి వెళ్లి ఆయనతో మరో దఫా చర్చలు జరుపుతున్నారు.