NTV Telugu Site icon

MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్

Mla Rapaka Varaprasad

Mla Rapaka Varaprasad

MLA Rapaka Varaprasad Said TDP Offered Him 10 Crores For MLC Vote: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారన్న నెపంతో నలుగురు ఎమ్మెల్యేల్ని వైసీపీ అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే! అంతేకాదు.. ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని, రూ.10 నుంచి రూ.20 కోట్ల దాకా డబ్బులు కూడా తీసుకున్నారని అధికార పార్టీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే మొదటి బేరం వచ్చిందని, టీడీపీ తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుని అమ్ముకుని ఉంటే.. తనకు రూ.10 కోట్లు వచ్చి ఉండేవని బాంబ్ పేల్చారు.

Kakani Govardhan Reddy: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. చర్చకు సిద్ధమా?

రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ.. ‘‘మొదట నా ఓటు కోసం టీడీపీ నేతలు నా మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో సంప్రదింపులు జరిపారు. టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు నాతో బేరానికి వచ్చారు. అయితే.. నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని నేను ఈ ఆఫర్‌ని తిరస్కరించలేదు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే నాకు ఆ రూ.10 కోట్లు వచ్చి ఉండేవి. కానీ.. ఒకసారి పరువుపోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేం. జగన్ నాయకత్వాన్ని నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‌ని తిరస్కరించాను’’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తనతో టీడీపీ బేరాలు జరిపిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే సతీష్, మంత్రి వేణుగోపాల కృష్ణకు చెప్పానన్నారు. అయితే.. వారు పార్టీ అధిష్టానానికి చెప్పారో, లేదో తనకు తెలియదన్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని పార్టీకి ముందే తెలుసని పేర్కొన్నారు.

Gudivada Amarnath: ఉండవల్లి కాదు, ఊసరవెల్లి శ్రీదేవి.. నటి శ్రీదేవి కంటే అద్భుతంగా నటిస్తున్నారు

ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 6 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ విజయం సాధించింది. అయితే.. ఆ ఒక్క స్థానం కూడా తమకే వచ్చేదని, తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి పంచుమర్తి అనురాధ గెలిచేలా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. అంతర్గత విచారణ జరిపి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను సైతం వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసేసింది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే రాపాక తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని చెప్పడం.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.