ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ చీప్ ట్రిక్కులని ప్రజలని నమ్మవద్దని కోరుతున్నానన్నారు. అంతేకాకుండా మంత్రి కొడాలి నాని పై కక్ష ఉంటే ఎన్నికలలో తేల్చుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
క్యాసినోలని, క్లబ్బులని ప్రోత్సహించే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదని.. అలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించే అలవాటు టీడీపీకే ఉందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులని దృష్డిలో పెట్టుకుని ఉద్యోగులకి ఎంత మేలు చేయాలో సీఎం వైఎస్ జగన్ అంతా చేశారన్నారు. కొన్ని విషయాలలో ఉద్యోగులకి అసంతృప్తి ఉండచ్చు..సీఎంతో, కమిటీతో చర్చించవచ్చు.. ఉద్యోగుల వాడే భాష సరైందికాదు…మీకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.. ఈ ప్రభుత్వం ఉద్యోగులని ఆదరించే ప్రభుత్వం అని ఆయన అన్నారు.