NTV Telugu Site icon

Minister Satya Kumar: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్

Satya

Satya

Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీకి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లిచ్చింది అని గుర్తు చేశారు. చేతకాని నాటి సీఎం జగన్ పులివెందులతో సహా ఒక్క కాలేజీకి కూడా కావాల్సిన వసతులు పూర్తి చెయ్యలేదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు.

Read Also: Telangana Assembly : 27 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టేది ఆ రోజే..

ఇక, ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8,480 కోట్లలో కేవలం 15 శాతం మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేశారు అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మిగిలిన నిధుల్ని జగన్ దారి మళ్లించారు.. దాని కారణంగా రాష్ట్రం 2500 మెడికల్ సీట్లు మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే జగన్ కుట్ర అర్థమవుతోంది.. ఐదు మెడికల్ కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో.. కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారు.. చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరు.. సేవలందించడానికి నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది లేరు అని పేర్కొన్నారు. కనీసం, బాలికలు ఉండడానికి వసతి భవనాల్లేవు.. పులివెందుల కళాశాలకు ప్రజాధనం రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన జగన్, మదనపల్లిలో 500 కోట్లకు గాను 30 కోట్లు కుడా ఖర్చు పెట్టలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు.

Read Also: Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అయితే, నర్సీపట్నంలో కేవలం 2 శాతం నిధులు, పాలకొల్లు కాలేజీకి సున్నా నిధులను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అన్ని మెడికల్ కాలేజీల పరిస్థితి ఇదే.. గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీ పట్ల చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లు కూడా పిలువలేదు అని ఆరోపించారు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనా సిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మెడికల్ కాలేజీలెలా ప్రారంభించాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలి?.. నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి.. ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని సత్యకుమార్ యాదవ్ అడిగారు.