Site icon NTV Telugu

Andhra Pradesh: తాడేపల్లికి చేరిన ‘నగరి’ అసమ్మతి వ్యవహారం.. సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు

Minister Roja

Minister Roja

Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి రోజా పలుమార్లు విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో తనను పక్కనపెట్టి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చక్రపాణిరెడ్డి వర్గంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Lemon Tea: రోజూ లెమన్ టీ తాగితే.. బోలెడు ప్రయోజనాలు

ఈనెల16న నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడులో ఆర్బీకేలు, వెల్‌నెస్ కేంద్రాలకు చక్రపాణిరెడ్డి వర్గం ప్రారంభోత్సవాలు చేసింది. ఈ అంశంపై ఆవేదన చెందుతూ మంత్రి రోజా ఓ ఆడియో విడుదల చేశారు. తాజాగా ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి మంత్రి రోజా తీసుకువెళ్లడంతో నగరి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత తన నియోజకవర్గంలోని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేజే కుమార్‌, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజును మంత్రి రోజా దూరం పెట్టారు. వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ తరఫున కార్యక్రమాలను రెండు వర్గాలు విడిగా చేస్తున్నారు. కొందరు నాయకులు పెద్దిరెడ్డి అండతో పదవులు పొందడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఒకదశలో మంత్రి పెద్దిరెడ్డి కారణంగా రోజాకు మంత్రి పదవి కూడా రాదని ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ అనూహ్యంగా రోజాకు కేబినెట్‌లో బెర్తు ఖరారు చేశారు.

Exit mobile version