Site icon NTV Telugu

RK Roja: మన్యం వీరుడికి పవన్‌ ఇచ్చే విలువ ఇదా..?

Rk Roja

Rk Roja

అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా..! అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాని.. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారతావనికే స్ఫూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామ రాజు పుట్టిన నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టమంటూ తెలుగులో మాట్లాడారు. ఇక, ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌, మెగాస్టార్ చిరంజీవి, ఇతర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. ఇదే సమయంలో.. ఆ కార్యక్రమానికి హాజరుకాని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్లు చేశారు.

Read Also: TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు..

భీమవరంలో ఈ రోజు జరిగిన కార్యక్రమం ఒక అపురూప ఘట్టం.. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఘన విజయం చేశారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. అయితే, ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడి విగ్రహ ఆవిష్కరణలో భాగం కానివాళ్లు దురదృష్టవంతులు అని కామెంట్‌ చేశారు మంత్రి ఆర్కే రోజా.. కాగా, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన పవన్‌ కల్యాణ్.. అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని కీర్తించారు. ప్రజల సంపద, మాన ప్రాణాలకు పాలకులే భక్షకులైన నాడు, వారు అవినీతి, అశ్రిత పక్షపాతానికి లోనైన నాడు ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకలించే వీరులు ఉదయిస్తారని చెప్పేందుకు అల్లూరి సీతారామరాజే నిలువెత్తు తార్కాణం అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.

Exit mobile version