సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేసినట్లు కనిపించారు. ఏకంగా మంత్రుల వాహనాలను పోలీసులు ఆపడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మంత్రి పేర్ని నాని కూడా సీఎంతో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు మంత్రి కారు అడ్డంగా ఉందని.. దానిని పక్కకు తీయాలని చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ‘నేను ఎవరో తెలుసా? నా డిసిగ్నేషన్ ఏంటో తెలుసా’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. నా కారు తీయాలని చెప్పింది ఎవరు అంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.
అక్కడే మరికొన్ని కార్లు పార్క్ చేసి ఉండడంతో అవన్నీ ఎవరి కార్లు అంటూ పోలీసులను మంత్రి పేర్ని నాని నిలదీశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ కోపంతో ఊగిపోయారు. ఎస్పీ కార్లు, డీఐజీ కార్లు ఇక్కడ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. డిసిగ్నేషన్లు తక్కువ అయినవారి వాహనాలు అక్కడే ఉంచి.. తన కారు తీయమని చెప్పడంపై మండిపడ్డారు. మర్యాదగా ఉండదు.. ఇక్కడితో పండగ అయిపోలేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
