Site icon NTV Telugu

YSRCP: పవన్‌కు మంత్రి పేర్నినాని కౌంటర్.. నమస్కారాలకు ప్రతి నమస్కారాలు..

జనసేన పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్‌ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యం.. పవన్‌ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్‌ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్‌ కల్యాణ్‌ ఉండేవాడా? అంటూ ప్రశ్నించారు.. టీడీపీ బాగుండాలనే పవన్‌ కోరుకుంటున్నాడని ఆరోపించిన మంత్రి.. పవన్‌ ఎప్పుడు తమ పార్టీలోకి వస్తారని టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇక, జనసేన సభలోనూ సినిమా డైలాగులనే పేల్చారని పవన్‌పై సెటైర్లు వేసిన మంత్రి పేర్నినాని.. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా? అని నిలదీశారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగలేరా? అని నిలదీశారు.. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా​ పట్టుకుని అడగగలరా? అని దుయ్యబట్టారు. పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ సినిమా డైలాగులే చెప్పారని ఎద్దేవా చేసిన ఆయన.. గల్లీలోనే మన డైలాగ్‌లు.. మరి ఢిల్లీలో ఎందుకు నిలదీయడం లేదని ఫైర్‌ అయ్యారు. వెల్లంపల్లి వెల్లుల్లి, ర్యాంబో రాంబాబు అంటూ మీరు మాట్లాడొచ్చా..? ఆడ మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చెయ్యొచ్చా..? అని ఫైర్‌ అయ్యారు. ఇక, సభ ప్రారంభంలో.. ఎవ్వరినీ వదలకుండా పవన్‌ కల్యాణ్‌ నమస్కారాలు పెట్టారు.. నాకు సంస్కారం ఉంది.. కాబట్టి.. వైసీపీ నేతలకు కూడా నమస్కారాలు చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆయనకు ప్రతిగా నమస్కారాలు పెట్టారు పేర్నినాని..

Exit mobile version