కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాక ముందు కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ కంటే.. థర్డ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఉంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. 75 శాతం వాక్సినేషన్ జరిగిన ఫ్రాన్ వంటి దేశాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది.
అయితే ఏపీలో కూడా ఒమిక్రాన్ ప్రభావం అధికంగానే ఉంది. దీంతో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. మంత్రి కొడాలి నానితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశం కానున్నారు. కరోనా సోకడంతో మంత్రి పేర్ని నాని ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు.