Site icon NTV Telugu

PeddiReddy Ramachandra Reddy: ఏపీలో పులుల సంపద ఎక్కువగానే ఉంది.. కానీ..!!

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

PeddiReddy Ramachandra Reddy: తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రిపెద్దిరెడ్డి తిలకించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్ సైట్‌ను విడుదల చేశారు. అనంతరం ఉద్యోగంలో ప్రతిభ కనబర్చిన పలువురు అటవీ శాఖ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. రష్యాలో టైగర్ సదస్సు 2010లో జరిగిందని.. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్- శ్రీశైలం మధ్య ఉందని తెలిపారు.

Read Also: Ravela Kishore Babu : ఆ మాజీ మంత్రికి కాలం కలిసిరావడం లేదా..? ఎన్నో ఆశలు పెట్టుకున్నారా..?

2018 కంటే ఇప్పుడు 60 శాతం పులులు పెరిగాయని.. దాదాపు సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో 64 పులులు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. శేషాచలంను కారిడార్‌గా చేసుకుని పులులు సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. పాపికొండలు వైపు కూడా పులులు సంచరిస్తున్నాయని తెలిపారు. దాదాపుగా 75 పులులు రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు లెక్కలు ఉన్నాయన్నారు. గతంలో కేవలం ఫుట్ ప్రింట్స్ ఆధారంగా పులులు గణాంకాలు జరిగేవని.. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందని.. అవసరమైన టెక్నాలజీని ఎప్పటికప్పుడు వినియోగిస్తూ పులుల వృద్ధికి, సంరక్షణకు కృషి చేయాలని అధికారులను కోరుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కృష్ణ జింకలు లాంటి జంతువుల సంఖ్య అసాధారణంగా పెరగకుండా పులులు మనకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో పులుల సంపద ఎక్కువగా ఉందని చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version