NTV Telugu Site icon

PeddiReddy: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీదే గెలుపు.. ఇది పక్కా..!!

Peddi Reddy Ramachandra Reddy

Peddi Reddy Ramachandra Reddy

Minister PeddiReddy Ramachandra Reddy: ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం నాడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చి అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీదే విజయమని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు.

Read Also:RRR: బిగ్ బ్రేకింగ్.. ఆస్కార్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’ కు నో ఎంట్రీ

వచ్చే ఎన్నికల నాటికి కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల పనులు పూర్తవుతాయని.. గత ప్రభుత్వ హయాంలో కమీషన్‌లకు కక్కుర్తి పడి కాలువల పనులు పూర్తి చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశారు. కుప్పంలో సీఎం జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని.. ప్రజలందరూ ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ కూడా పర్యవేక్షించారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వారు తెలిపారు. కాగా ఈ పర్యటనలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.