కరోనా మహమ్మారి ప్రభావం అందరిపైన ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లాంటివి విధించారు. ఏపీ లోనూ కరోనా రక్కసి విజృంభిస్తోంది. అధికార వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా రెండో సారి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
అయితే నిన్న జరిగిన కాబినెట్ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అంతేకాకుండా మంత్రి మేకపాటి సమావేశం జరిగినంత సేపు మాస్క్ ధరించలేదని తెలుస్తోంది. అయితే నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి మేకపాటి సూచించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.