సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించామని.. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వీఐపీలకు మూడు ప్రదేశాలలో టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటుతో పాటు వాహనాలలో కొండపైకి తీసుకెళ్తామన్నారు. దసరా మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని తెలిపారు. భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాదం కౌంటర్లు పెంచుతామని.. రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్సులలో కూడా ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. లడ్డు నాణ్యత పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. నాణ్యత పెంచినా లడ్డూ ధర పెంచడం లేదని.. 15 రూపాయలే కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వీఐపీ టిక్కెట్లు కేటాయింపు ఉంటుందన్నారు. వీఐపీల కోసం, భక్తుల కోసం స్లాట్ విధానం పెట్టాలనుకున్నాం కానీ ఈ దసరా మహోత్సవాలలో స్లాట్ విధానం పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సిఫార్సు లేఖలకు రూ.500 వీఐపీ టిక్కెట్ల దర్శనం కల్పిస్తామని.. అన్ని శాఖల సమన్వయంతో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వాలంటీర్లకి క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డు ఇస్తామని పేర్కొన్నారు. 500 రూపాయల టిక్కెట్లు కూడా స్కానింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.