నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించి ముందుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీకి రాష్ట్రంలో ఏ అంశమూ లేదని, ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం సహా ఏదేదో చేస్తున్నారన్నారు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకూ ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారని, ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరతాడు.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే చంద్రబాబును ఎవరైనా ఆపారా ..? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పేరును కూడా చంపేయాలని నీచమైన ఆలోచన చంద్రబాబుది అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఒడిపోయి అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఛీర్ బాయ్స్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తాడు..సోము వీర్రాజు అమలు చేస్తారు. రాష్ట్రంలో టీడీపీకు బీ- పార్టీగా బీజేపీ మారింది. సోము వీర్రాజు టీడీపీకి బీ టీంగా బీజేపీని తయారు చేశారు. సోము వీర్రాజు బీజేపీని చంద్రబాబుకు అద్దెకిచ్చారు. జిల్లాల విభజన అనగానే ఉద్యోగుల ఆందోళనలు పక్కకు వెళ్ళి పోయాయా..? ఉద్యోగులు ఆందోళనలు మానేశారా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తులు ఇలా మాట్లాడితారా అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.