ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.
మమతాబెనర్జీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేయటంతో పెగాసస్ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చిందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీ వేయడం మంచి పరిణామం అన్నారు. ఈ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు కాబట్టి సరిగ్గా విచారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ కేసులపై అయినా స్టే తెచ్చుకుంటామనే నమ్మకం చంద్రబాబు, లోకేష్‌కు ఉందని.. స్టేలు వస్తాయనే తప్ప తాము తప్పు చేయలేదని వారు ఎప్పుడూ చెప్పరని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. కానీ ఈ కేసులో స్టే తెచ్చుకోలేరని.. వారు దొరికిపోతారని ఆరోపించారు. హౌస్ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. ఆ రోజు ఐటీ మంత్రిగా లోకేషే ఉన్నాడని.. పెగాసెస్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. అందుకే ఈ అంశంపై సీరియస్‌గా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు పెగాసస్ వివాదంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెగాసస్ అంశంలో అవసరమైతే మమతా బెనర్జీని కూడా ఆధారాలు ఉంటే ఇవ్వమని అడుగుతామని బాలినేని తెలిపారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కూడా అవసరమైతే విచారిస్తామన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌పై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు మమతా బెనర్జీని కలిశారని.. హౌస్ కమిటీ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మంత్రి బాలినేని అన్నారు. ఇంత దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
