Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: బాబు హయాంలో రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. గత మూడేళ్ళలో కరువు మండలాలు లేవని గుర్తుచేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎంత చేశారో చెప్పాలన్నారు. లక్ష కోట్లయినా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారని.. బంగారు రుణాలకూ మాఫీ వర్తింప చేస్తామన్నారని.. ఆయన హామీలు నెరవేర్చక పోవడంతో అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోయారని మండిపడ్డారు.

Read Also: Andhra Pradesh: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీ వీఆర్వోలు

చంద్రబాబు మాదిరి కాకుండా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. వరుసగా 4 ఏళ్లుగా జలాశయాలు నిండుతున్నాయన్నారు. గతంలో కంటే 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. చంద్రబాబు హయాంలో జలాశయాలకు నీరు రాలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు పంట నష్టపోతే బీమా ఇస్తున్నామన్నారు. ఇన్ పుట్ సబ్సిడీని అదే సీజన్‌లో ఇస్తున్నామని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు చెందిన బకాయిలను కూడా జగన్ వచ్చిన తర్వాత చెల్లించారన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానని కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకున్నారని విమర్శలు చేశారు.

Exit mobile version