Site icon NTV Telugu

Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరం నుంచే పరిపాలన రాజధానిగా విశాఖ

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే ఇవాళ సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని చురకలు అంటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందని తెలిపారు.

రానున్న కాలంలో పరిశ్రమల్లో పెట్టబోయే పెట్టుబడులపై సభలో చర్చిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం, చిత్తశుద్ధి లేదని.. మిగిలిన టీడీపీ నేతల తీరు సభకు వచ్చామా… వెళ్లామా అనేలా ఉందని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ సెల్లింగ్‌లో చంద్రబాబు ఘనుడు అని.. పరిశ్రమలను ఎలా అమ్మేశాడో గతంలో చూశామని ఆరోపించారు. ఎంఎస్ఎమ్ఈల ద్వారా 2 లక్షల 11 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మరో లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీచ్ ఐటీని అభివృద్ది చేస్తామని.. ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మీట్‌లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతంలో కంటే తమ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖ ప్రధాన నగరంగా ఉందని.. దేశంలోని టాప్ టెన్ నగరాల లిస్టులో విశాఖ ఉందని తెలిపారు.

Read Also: Ram Charan: ఆస్కార్ రేసులో మెగా పవర్ స్టార్.. తారక్ కు పోటీ..?

విశాఖలో జరిగే లావాదేవీల్లో తప్పేముందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం జగన్ తమ వైఖరి చెప్పారని.. మూడు రాజధానుల ప్రకటన తర్వాత లావాదేవీలను టీడీపీ నేతలు నిరూపించాలని.. ఆధారాలుంటే తీసుకురావాలని సూచించారు. విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోం అని.. అక్రమాలకు ఆస్కారం ఎక్కడ ఉందని నిలదీశారు. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. యాత్ర పేరుతో విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యుడు అవుతాడన్నారు.

Exit mobile version