NTV Telugu Site icon

Gudivada Amarnath: అమరరాజా ఏపీలోనే ఉండాలా? పెట్టుబడులపై తప్పుడు ప్రచారమేంటి?

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను ఆంద్రప్రదేశ్ నుంచి తరిమేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అమర్ రాజా సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని చెప్పారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ ఏపీలోనే ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా అని నిలదీశారు. అమర్ రాజా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని.. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాసిన రెండు పేపర్లు క్షమాపణ చెప్పాలన్నారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీది కాబట్టి ప్రభుత్వంపై రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో లేదా అని.. ఆయన్ను తమ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందా అని సూటి ప్రశ్న వేశారు.

Read Also: Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం

ప్రతిపక్ష పార్టీ నేతల పరిశ్రమలు ఏపీలో ఉండకూడదు అనుకుంటే చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉండేదా అన్నారు. పరిశ్రమలను సీఎం జగన్ ఎన్నడూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు. పరిశ్రమలు ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది సీఎం ఆలోచన అన్నారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసి పక్క రాష్ట్రాల్లో టీడీపీ నేతలు పెట్టుబడులు పెట్టాలనే కోణంలో వార్తలు రాశారన్నారు. ఫాథర్ ఆఫ్ ఐటీ అంటూ చంద్రబాబు మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చురకలు అంటించారు. మొన్నటి వరకు చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారని.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు చివరి ఎన్నికలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారని.. లక్షా 45 వేల కోట్ల ఎగుమతులు చేసి దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు16 లక్షల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పెట్టుబడులు తెచ్చారని ఆరోపించారు.