Site icon NTV Telugu

Dharmana Prasad Rao: ఢిల్లీలో ఉన్న దేశ రాజధానిని కూడా మార్చుకోవచ్చు

Dharmana Prasad Rao

Dharmana Prasad Rao

Dharmana Prasad Rao: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, మేధావులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లాంటి రాజధాని నుంచి విడిపోయిన మనం దురదృష్టవంతులు అయ్యామని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని నిర్మాణం కాకపోవడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాజధాని విషయంలో టీడీపీ హయాంలోనే మోసం జరిగిందని తెలిపారు.

Read Also: Kishan Reddy: పీకేని కేసీఆర్‌ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!

టీడీపీ హయాంలో శ్రీకృష్ణకమిటీ నివేదికను అమలు చేయలేదని మంత్రి ధర్మాన విమర్శలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన వివరించారు. రాజధాని మార్చుకోవడానికి యాక్ట్ ఉందని.. కావాలంటే ఢిల్లీలో ఉన్న దేశరాజధానిని కూడా మార్చుకోవచ్చన్నారు. అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు కానీ.. అంత డబ్బును అమరావతిపై పెట్టే పరిస్థితి లేదన్నారు. రాజధాని ఏర్పాటుకు 55 వేల ఎకరాలు అవసరం లేదన్నారు. రాజధాని భూములను టీడీపీ నేతలతో కొనిపించి గుప్పెట్లో పెట్టుకోవాలని చంద్రబాబు చూశారని మంత్రి ధర్మాన ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు అయినా రాజధాని నిర్మాణం కాకుండా చంద్రబాబు రాద్దాంతం చేసి అడ్డుపడుతున్నారన్నారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తే టీడీపీకి నష్టమేంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోసం ఇంకా వందల కిలోమీటర్లు ఇప్పటికీ వెళ్లాలా అని నిలదీశారు. విశాఖలో రాజధానిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి ధర్మాన హెచ్చరించారు.

ఆనాడు శ్రీకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు శాసనసభలో ఎందుకు పెట్టలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దని శ్రీకృష్ణకమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా బాగుండాలని.. అందులో అమరావతి ఉండాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబు భూముల విలువలు పెంచుకోవడం కోసమే అమరావతిని రాజధానిగా పెట్టారన్నారు. రియల్ ఎస్టేట్ భూముల కోసమే అమరావతి రైతుల యాత్ర సాగుతుందన్నారు. అమరావతి రైతులు అరసవిల్లి సూర్యనారాయణ మూర్తిని కోరుతున్నట్లే వైసీపీ ఆధ్వర్యంలో విజయదశమి రోజున రాష్ట్రంలో అందరు దేవుళ్లకు కొబ్బరికాయలు కొడతామన్నారు.

Exit mobile version