Site icon NTV Telugu

Buggana Rajendranath Reddy: అవాస్తవాలు మాట్లాడొద్దు.. ఆ ప్రభుత్వ బకాయిలను కూడా మేమే తీర్చాం..

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy

ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. యనమలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియట్లేదన్న ఆయన.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజానిజాలు తెలియకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్‌ అయ్యారు.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు యనమల మాట్లాడుతున్నారు.. కానీ, అన్ని శాఖల్లోనూ పెండింగ్ బిల్లులే ఉన్నాయి… సున్నా వడ్డీ, పావలా వడ్డీలో పెండింగ్ ఆ ప్రభుత్వమే పెట్టింది.. ఆ ప్రభుత్వ బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందని వెల్లడించారు.

Read Also: 88th marriage: 14 ఏళ్లకే మొదలుపెట్టేశాడట.. 61వ ఏట 88వ పెళ్లి..!

ప్రస్తుతం ధాన్యం బిల్లుల చెల్లింపులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని తెలిపారు మంత్రి బుగ్గన.. ఇన్‌పుట్‌ సబ్సిడీ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం.. కానీ, అవాస్తవాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.. ఇక, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎంత వినియోగం అవుతుందో కచ్చితమైన లెక్క తెలియడం లేదని.. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తోన్నా.. యనమలకు అర్థం కావడం లేదని విమర్శించారు.. అప్పుడప్పుడు ఓ పీహెచ్‌సీకో.. ఓ స్కూల్‌కో యనమల వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించిన ఆయన.. విజయవాడలో కూర్చొని యనమల అవాస్తవాలు మాట్లాడ్డం సరికాదని హితవుపలికారు..

అంతేకాదు.. అప్పుడప్పుడు తుని వెళ్లాలని యనమలకు సూచించారు మంత్రి బుగ్గన.. యనమల తుని వెళ్లాలంటే ఎయిర్ పోర్టు వేయాలేమో..? అని సెటైర్లు వేశారు.. వైసీపీ ప్రభుత్వంలోనే పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పర్సెంటేజ్ పెరిగిందనన్నారు.. ఇక, టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం అవుతోందని విమర్శించారు.. పసుపు కుంకమ డబ్బులను క్యూలో నించోబెట్టి చెక్కులిచ్చారని.. అలాగే మహిళలు కూడా క్యూలో నిల్చొని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న ఆయన.. కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రోడ్లు వేయని మాట వాస్తవమే అన్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల భవనాల కోసం పీఆర్ రోడ్లు తక్కువగానే వేశాం… వైఎస్సార్ ఆహ్వానం మేరకు నాడే కియా సంస్థని స్థాపించాలని భావించామని కియా ఎండీ లేఖ రాశారని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

అయితే, బుగ్గన వ్యాఖ్యలపై మండిపడ్డారు యనమల.. బుగ్గన మాటలు చీకట్లో అద్దం చూపించే మాదిరి ఉన్నాయని.. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలని బుగ్గన ప్రయత్నిస్తున్నారు.. విద్యుత్ మీటర్ల పేరుతో రూ. 3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ విద్యుత్ వినియోగం తెలసుకునేందుకు మీటర్లు పెడుతున్నామనడం సిగ్గుచేటు అంటూ ఫైర్‌ అయ్యారు.. విద్యుత్ వినియోగం తెలుసుకోవాలంటే మార్కెట్లో దొరికే రూ.300ల సాధారణ విద్యుత్ మీటర్ సరిపోతుంది. ఒక్కో మీటర్ రూ.35 వేలు పెట్టి కొని కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం లేదు.. ఈ ఆర్ధిక సంవత్సరం ఏడు నెలల్లో రూ. 53,500 కోట్లు అప్పు చేసింది చాలక మారిటైమ్ బోర్డు ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసేందుకు రంగం సిద్ధం చేశారని.. ఏడాదికి దాదాపు రూ.1,20,000 కోట్లు అప్పు చేసి టీడీపీ కంటే తక్కువ అప్పు చేసామని చెప్పడం బుగ్గన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version