NTV Telugu Site icon

Botsa satyanarayana: అమరావతిలో ఉన్నది రైతులు కాదు.. బ్రోకర్లు, బాబు చుట్టాలు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన ప్రస్తావనలను మొదట్నుంచీ తమ ప్రభుత్వం చెప్తోందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులపై కామెంట్ చేయడం భావ్యం కాదని మంత్రి బొత్స అన్నారు.

Read Also: Ben Stokes: పాకిస్థాన్‌కు బెన్ స్టోక్స్ భారీ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..?

ప్రభుత్వం అంటే సెట్టింగ్‌లా చంద్రబాబు భావించారని.. అందుకే రాజధానిలో రెండు బిల్డింగ్‌లే కట్టారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం స్క్వేర్ ఫీట్‌కు రూ.11వేలు ఖర్చు పెట్టారని వివరించారు. అమరావతిలో ఉన్నది రైతులు కాదని.. బ్రోకర్లు అని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని.. చంద్రబాబు చుట్టాలు అని ఆరోపించారు. రైతుల పేరుతో ఇతరులు చలామణి అవుతున్నారని.. కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ విధానం అన్నారు. వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. చివరకు న్యాయమే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఈ అంశంపై స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే న్యాయం ఇంకా ఉంది అనిపిస్తుందన్నారు. హై కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పు పట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 4,700 ఎకరాలు తన సొంత మనుషులతో చంద్రబాబు కొనిపించారని తేలిందన్నారు. అమరావతి రైతులతో చంద్రబాబు పాదయాత్రలు చేయించారని ఆరోపించారు. సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలని.. ప్రభుత్వం చేసే పనులను న్యాయస్థానాలు చేయకూడదని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అభిప్రాయపడ్డారు.

Show comments