బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని అన్నారు. అయితే చనిపోయిన కోళ్లలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షలు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7 వేలు కోళ్లు చనిపోయినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. చనిపోయిన కోళ్లను ఆధునిక ల్యాబ్ భోపాల్‌కు పంపామని వెల్లడించారు. అయితే.. నిన్న రిపోర్ట్ వచ్చిందని, అవి బర్డ్ ఫ్లూతో చనిపోయినట్టు నిర్ధారణ అయిందని మంత్రి అచ్చెన్న చెప్పారు.
Read Also: Skoda kylaq: స్కోడా కైలాక్ సంచలనం.. జనవరిలో1,242 యూనిట్ల విక్రయం..
రాష్ట్రంలో 5 లక్షల కోళ్లు చనిపోయినట్టు తెలిసింది.. అయితే 40 లక్షల కోళ్లు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తక్కువ టెంపరేచర్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. కాగా.. కోళ్లు చనిపోయిన 10 కి.మీ పరిధిలో షాపులు మూసివేసామని చెప్పారు. బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. టెంపరేచర్ ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా వ్యాధి తగ్గుతుందని అన్నారు. 70 డిగ్రీల టెంపరేచర్ తర్వాత వ్యాధి చనిపోతుందని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. పౌల్ట్రీలు శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
Read Also: INDIA Alliance: ఇండియా కూటమిలో మరో ముసలం.. రసవత్తరంగా ‘‘మహా’’ రాజకీయం..
మరోవైపు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూతో కోళ్లు లక్షల్లో మృత్యువాత పడ్డాయి. అయితే.. ఇలా కోళ్లు చనిపోతుండటంతో చికెన్, గుడ్లు తినటంపై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. 100 డిగ్రీల వేడిలో చికెన్, గుడ్లు ఉడకబెట్టి తినవచ్చని చెబుతున్నారు అధికారులు.