Site icon NTV Telugu

Ambati Rambabu: గోదావరికి మళ్లీ వరద వచ్చే పరిస్థితి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

2018 లో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు కాళ్లు, చేతులు పైకి ఎత్తేశాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. లోయర్ కాఫర్ డ్యాంను చంద్రబాబు అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టే ప్రయత్నం చేశారని నిలదీశారు. నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఈనాడు రామోజీరావు వియ్యంకుడు అని.. నవయుగను తప్పించి పోలవరం పనులను మేఘా కంపెనీకి ఇచ్చామని కడుపుమంటతో ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో దోచుకుందాం.. దాచుకుందాం అనుకున్నారని.. ట్రాన్స్‌ట్రాయ్‌ను తీసేసి చంద్రబాబు నవయుగ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము రివర్స్ టెండర్ ద్వారా మరింత తక్కువకు మేఘాకు ఇచ్చామన్నారు.

ఇసుక నుంచి ఏడాదికి 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ వందల కోట్లు దోచుకుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. వనజాక్షి లాంటి అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏం జరిగిందో ప్రజలు అందరూ చూశారని.. ట్రాన్స్ ట్రాయ్‌ను తప్పించి నామినేషన్ లో నవయుగకు ఇవ్వటం స్కాం కాదా అని ప్రశ్నించారు. పోలవరం విషయంలో టీడీపీ చేసిన పాపాలు సరిచేయలేక తాము నానాపాట్లు పడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. ఓబుళాపురం మైనింగ్‌పై టీడీపీ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని.. అక్కడ చాలా కాలం నుంచి వివాదం ఉందని.. ఎవరైనా సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌లో టీడీపీ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మాధవ్ గురించి, మాధవ్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు అని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. ప్రపంచంలో ఇవే ముఖ్యమైన విషయాలా అని ప్రశ్నించారు. ప్రధాని పలుకరించగానే చంద్రబాబు పులకరించి పోతున్నాడని.. ఎవరైనా పలకరిస్తే తప్పించి సొంతంగా స్థాయి లేదని అర్థం అయినట్లు ఉందని చురకలు అంటించారు. బొకే తోసేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పలకరిస్తాడని చంద్రబాబు తపించిపోతున్నాడని ఎద్దేవా చేశారు.

Exit mobile version