Site icon NTV Telugu

RIP Mekapati Goutham Reddy: నేడు నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం..

హైదరాబాద్‌లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 22, మంగళవారం దినఫలాలు

ఉదయం 8.30 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు.. ఇక, ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ బయల్దేరి.. ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు.. హెలికాప్టర్‌లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య ఉంటారని తెలుస్తోంది.. ఇప్పటికే నెల్లూరుకు బయల్దేరి వెళ్లిపోయారు మాజీ ఎంపీ, గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. మరోవైపు, ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు.. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక, రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది.. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా 2 రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన జగనన్న తోడు మూడోవిడత ఆర్ధిక సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు.

Exit mobile version