Married Woman Commits Suicide In Front Of Police Station In Vizag: పెళ్లికి ముందు వాళ్లు అమితంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢ ప్రేమలో మునిగితేలారు. అందుకే, పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఆ జంట మధ్య లేదు. నిత్యం గొడవలతోనే రోజులు గడిచాయి. ఎన్ని రోజులైనా భర్త తన తీరు మార్చుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పింటించుకుంది. ఈ విషాద సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌కి కొంతకాలం క్రితం అనుకోకుండా పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది. ఇద్దరి అభిరుచులు కలవడం, గాఢంగా ప్రేమించుకోవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. మొదట్లో కొన్ని రోజులు అంతా సవ్యంగానే నడిచింది కానీ, ఆ తర్వాతి నుంచే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కారణం.. వినయ్‌కి ఉన్న మద్యం అలవాటే! మద్యం మానేయాలని శ్రావణి ఎంత ప్రాధేయపడినా.. వినయ్ మానుకోలేదు. ఇంకా తాగొచ్చి, ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. శ్రావని పోలీసుల్ని ఆశ్రయించింది. వినయ్ మద్యానికి బానిసై, తనని నిత్యం వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో.. పోలీసులు భార్యాభర్తలను స్టేషన్‌కి పిలిపించారు. వినయ్, శ్రావణికి కౌన్సిలింగ్ ఇస్తుండగానే.. మరోసారి ఇద్దరి మధ్య గొడవైంది. దీంతో మరింత కుంగిపోయిన శ్రావణి.. తన జీవితం నాశనమైందని భావించి, స్టేషన్ బయటికి వచ్చి, ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె శరీరం చాలా కాలిపోవడంతో.. చికిత్స పొందుతూ మరిణించింది. దాంతో.. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.