Site icon NTV Telugu

KRMB Decision: కృష్ణా న‌దిపై జలాశయాల నిర్వహణకు కమిటీ

Krmb1

Krmb1

విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా న‌దిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా న‌దిపై ఏర్పాటైన జ‌లాశ‌యాల నిర్వహ‌ణ‌కు ఓ క‌మిటీ ఏర్పాటైంది. హైద‌రాబాద్ జ‌లసౌధ‌లో ఇటీవ‌ల‌ జ‌రిగిన భేటీలో కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ క‌మిటీని ఏర్పాటు చేస్తూ కేఆర్ఎంబీ కీల‌క ప్రక‌ట‌న విడుదల చేసింది. కేఆర్ఎంబీ స‌భ్యుడు ర‌వికుమార్ పిళ్లై ఈ క‌మిటీకి క‌న్వీన‌ర్‌గా వ్యవహరించనున్నారు. ఈ క‌మిటీలో మిగిలిన స‌భ్యులుగా కేఆర్ఎంబీ స‌భ్యుడు మౌతాంగ్‌, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు, రెండు రాష్ట్రాల జెన్‌కోల‌కు చెందిన వెంక‌ట‌రాజం, సృజ‌య్ కుమార్‌లు నియ‌మితుల‌య్యారు.

కృష్ణానదికి సంబంధించి మూడు అంశాల ఆధారంగా ఈ క‌మిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, సాగ‌ర్‌లో విద్యుదుత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధి విధానాలు ఖ‌రారు చేయాల‌ని, నెల‌లోగా శ్రీశైలం, సాగ‌ర్ జ‌లాశ‌యాల రూల్ క‌ర్వ్ ముసాయిదా ప‌రిశీల‌న జ‌ర‌గాల‌ని కమిటీ సూచించింది. నదిలో 75 శాతం నీటి లభ్యతకు పైబడి వ‌ర‌ద జ‌లాల వినియోగానికి విధి విధానాలు రూపొందించనుంది. రెండు రాష్ట్రాలు డెడ్ స్టోరేజీకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించే విషయంలో కమిటీ విధి విధానాలు రూపొందించి కేఆర్ఎంబీకి అందచేయనుంది. మొత్తం మీద కమిటీ ద్వారా అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయని రెండురాష్ట్రాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Hyderabad : చేతివాటం పోలీసుపై సస్పెన్షన్ వేటు

Exit mobile version