తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలను విస్మరించి కేవలం భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వంద (100) స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని, రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.
నవంబర్ తర్వాత డైరెక్ట్ ఎన్నికలే మా టార్గెట్
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటికీ నవంబర్ నాటికి పూర్తిగా పరిష్కారం దొరుకుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నవంబర్ గడువు ముగిసిన తర్వాత ఇక ప్రత్యక్ష ఎన్నికలే తమ ప్రధాన టార్గెట్ అని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు పూర్తిస్థాయిలో ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చారని, పార్టీలో ఉన్నటువంటి అద్భుతమైన సమన్వయం దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ పార్టీయే శాశ్వతమని, గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా బలపడిందని చెప్పారు. ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూశానని తెలిపారు.
కేసీఆర్ అప్పులపై విమర్శలు.. ఎల్‌నినోపై హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్
గత కేసీఆర్ పాలనపై మండిపడిన పీసీసీ చీఫ్.. కేసీఆర్‌ను పెద్ద మేధావి అనుకుంటామని, కానీ ఎలాంటి దీర్ఘకాలిక ఆలోచనలు లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో అనేది కేవలం తెలంగాణ సమస్య కాదని, దేశమంతా దాని ప్రభావం ఉందని పేర్కొంటూ హరీష్ రావు పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పని అయిపోయింది.. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో భారీ విజయం
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, ఇప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న 8 ఎంపీ సీట్లలో కనీసం రెండు వస్తే గొప్పేనని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఏకంగా 40 శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉందని పీసీసీ చీఫ్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని చెప్పారు. ఇప్పటికే రైతులకు ఉచిత కరెంట్ అందిస్తూ, రికార్డు స్థాయిలో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ అభివృద్ధిని చూసే ప్రజలు మళ్లీ తమను ఆశీర్వదిస్తారని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

