విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు.
ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఏపీలో జగన్ పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలను ప్రశ్నించలేని దుస్థితి లో జగన్ ఉన్నారు. రాష్ట్రంలో పన్నులు, విద్యుత్ భారాలు పెంచారు. జగన్ మోడీ కనుసన్నల్లోనే పని చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ మోసం చేశారు. పొరాటాల ద్వారా పాలకుల్లో మార్పు రావాలన్నారు. ప్రజలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై గళమెత్తాలి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్ పెంచారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ..రెండు ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఏపీలో పెట్రోల్, గ్యాస్ ధరలే కాదు సిమెంట్, ఇసుక, ఐరన్ ధరలు పెంచేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ధరలు ఎక్కువ.
Read Also: Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్
ఆస్తి పన్ను 32శాతం పెంచారు, చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. విద్యుత్ ఛార్జీలు పెంచి కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. అదానీ కంపెనీతో కుమ్మక్కై, వారిచ్చే కమిషన్ల కోసం ప్రజలపై విద్యుత్ భారాలు మోపారు. ప్రతిపక్షంలో విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్తును రాజస్థాన్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయలేరా..? డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ప్రయాణికులపై భారం మోపారు.
ఇన్ని రకాలుగా భారాలు మోపినా.. 24 గంటలూ విద్యుత్ ఇవ్వలేక పోతున్నారు.మే 1వ తేదీ నుండి కరెంటు ఎలా వస్తుందో మంత్రి చెప్పాలి.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం విద్యుత్ కొనలేని స్థితిలో ఉంది.మోడీ, జగన్ పోటీ పడుతూ ప్రజలను దోచుకుంటున్నారు.అన్ని రకాల ఛార్జీలు, పన్నుల భారాలు తగ్గించాలి.ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు.