కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ద్రోహం జరిగిందంటూ వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రధాని విశాఖకు వస్తారని అంటున్నారు.. ఆ రోజున విశాఖ రైల్వై జోన్.. ప్రత్యేక హోదాల మీద ప్రధాని ప్రకటనలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని హామీ ఇవ్వాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.
రాష్ట్రానికి అన్యాయం చేస్తే బీజేపీకి పుట్టగతులుండవు.విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదు.కరోనా కష్టకాలంలో ఉద్దీపన పథకాల పేరుతో కార్పోరేట్ కంపెనీలకు నిధులు కట్టబెట్టారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్ లో పేదలకు అన్యాయం చేసి.. కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేశారు. రైతులకు అందే నిధుల్లో కోత విధించారు. ఏపీకి తీవ్రంగా అన్యాయం చేశారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్‌ను గాలికొదిలేశారు.. వెనుకబడిన జిల్లాల నిధులను ఇవ్వడం లేదు. విశాఖ రైల్వే జోన్‌కు నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు వామపక్షాల నేతలు.