ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని… ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని… అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందన్నారు.
Read Also: బ్రేకింగ్: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకమని.. ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే ఉందని.. ఈ ఘాట్ దగ్గరని కాదు కానీ… తెలుగు రాష్ట్రాల ప్రజలందరి వద్ద ఆయన ఆత్మ తిరుగుతూ బాగోగులు చూసుకుంటోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహానుభావుడని.. ఎప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. జాతికి ఇలాంటి వారు ఒకళ్లే పుడతారన్నారు. తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. తాను బతికున్నంతవరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని.. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారని… ఆయన జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నానన్నారు.
అటు ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం ఘటనలపైనా లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని ఆమె సూచించారు.