చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పీవిపురం వాగులో ఓ మహిళ గల్లంతయింది. పీవీపురంవాగు దాటుతూ వుండగా నీటి వేగానికి అదుపు తప్పి.. ఓ మహిళ గల‌్లంతైంది. పీవిపురానికి చెందిన ఇద‌్దరు మహిళలు, ఒక యువకుడు పొలం వద్ద నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వాగును దాటుతుండగా ప్రవాహం వేగానికి కొంతదూరం కొట్టుకొని పోయారు. యువకుడు ఒకరిని రక్షించ గలిగాడు.
ఈ ప్రమాదంలో 37 ఏళ్ళ సరళ అనే మహిళ వాగులో కొట్టుకు పోయింది. సమాచారం తెలుసుకున‌్న గ్రామస్థులు పరిసరాలలో కొంతదూరం వరకు గాలింపు చర‌్యలు చేపట్టారు. చీకటీ పడటంతో ఏం చేయలేక పోయారు. ఈ ప్రమాదంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దారు చినవెంకటేశ్వర్లు, వీఆర్వో రేవతి గ్రామానికి చేరుకుని ప్రమాద గురించి అడిగి తెలుసుకున్నారు. వాగులు దాటే విషయంలో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.