AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్

Yemmiganur

Yemmiganur

AP ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ఓ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల కట్ట చెత్తకుప్పలో బయటపడటం రాజకీయంగా కలకలం రేపుతోంది. స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలోని చెత్తకుప్పలో సుమారు 50 బ్యాలెట్ పేపర్లు ఉన్న కట్టను గుర్తించారు. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలోనే ఈ బ్యాలెట్ పేపర్లు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి అక్కడికి చేరుకుని బ్యాలెట్ పేపర్ల కట్టను తెరిచి మీడియాకు చూపించారు. వాటిలో ఒక బ్యాలెట్ పేపర్‌ను పరిశీలించగా, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసినట్లు కనిపించిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈ బ్యాలెట్ పత్రాలను లెక్కించారా? లేక లెక్కించకుండా పక్కన పడేశారా? అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. అసలు బ్యాలెట్ పేపర్లు చెత్తకుప్పలోకి ఎలా చేరాయో అధికారులు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు..

ఈ నెల 3వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రస్తుతం బయటపడిన బ్యాలెట్ పేపర్ల కట్ట గోనెగండ్ల జడ్పీటీసీ నియోజకవర్గానికి సంబంధించినదిగా గుర్తించినట్లు సమాచారం. గోనెగండ్ల మండలంలోని 14/59, 14/50 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ పత్రాలుగా తెలుస్తోంది. ఇవి చిన్నమరివీడు గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 700కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల కట్ట బయటపడటంతో వైసీపీ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యులైన అధికారులపై ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.. మరోవైపు, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించామని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గతంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు బయటపడిన బ్యాలెట్ పేపర్లపై ఆయన సమాధానం చెప్పాలని రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఈ బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్‌లో లెక్కించారా లేదా, అవి చెత్తకుప్పలోకి ఎలా చేరాయన్న విషయాలపై అధికారుల వివరణ రావాల్సి ఉంది.