Kurnool Crime: కర్నూలు జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్.. ఇపుడు ఆ పదం వినిపించడమే అరుదు. అలాంటి సమయంలో ఎమ్మిగనూరు మండలం కాందనాతిలో పాత కక్షలు చెలరేగి ఇద్దరు వేటకొడవళ్లకు బలయ్యారు. ఇంట్లో, పొలం వెళ్లే దారిలో, పొలంలో… ఇలా వెంటాడి వేటాడి హత్య చేశారు. ఏడాది క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారమే ఈ హత్యలుగా తేల్చారు.. కందనాతిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబలపై ప్రత్యర్థులు చెలరేగిపోయారు. పరమేష్ అనే వ్యక్తిని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులు పొలంలో ఉన్నారని తెలిసి మూకుమ్మడిగా కొడవళ్లతో వెళ్లారు. పొలం పనులు పూర్తి చేసుకొని ట్రాక్టర్ లో గోవింద్ (45), భార్య వీరేషమ్మ వస్తుడగా వారిపైనా దాడి చేశారు. వేటకొడవళ్ల దాడిలో గోవింద్ పొట్ట చీలిపోయి పేగులు బయటికి వచ్చాయి. వీరేషమ్మ పై దాడి చేయబోగా వేటకొడవలి వేటు ఆమె ఐదేళ్ల కుమారుడు లోకేంద్ర కు పది తీవ్రంగా గాయపడ్డారు. వీరేషమ్మ కేకలు వేయడంతో ప్రత్యర్థులు పొలం వైపు వెళ్లారు. పొలంలో ఉన్న వెంకటేష్ ను కూడా నరికి చంపేశారు. గాయపడిన గోవిందు, ఐదేళ్ల బాలుడు లోకేంద్ర ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Read Also: Rahul Gandhi: వియత్నాం టూర్లో రాహుల్ గాంధీ.. ‘‘పార్టీ-టూరిజం’’ లీడర్ అని బీజేపీ ఫైర్..
ఈ హత్యలకు పాత కక్షలు కారణంగా పోలీసులు తేల్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో కంధనాతిలో దేవర ఉత్సవాలు జరుగుతుండగా రెండు కుటుంబాల మధ్య నీటి కుళాయి వద్ద ఘర్షణ జరిగింది. ఆ రెండు కుటుంబాలు అప్పుడు ఒకరు వైసీపీలో ఉండగా , మరొకరు టీడీపీలో వున్నారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కుటుంబానికి చెందిన బిక్కి నరసింహులు, ఆయన కుమారుడు రవి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తరువాత వారి ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్, గోవిందు కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరా పండగ సందర్భంలో వెంకటేష్, గోవిందు, పరమేష్ కుటుంబాలు తిరిగి తమ గ్రామం చేరుకున్నారు. అయితే ఈసారి ఈ మూడు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. దీంతో ధైర్యంగానే ఊరు చేరుకున్నారు. అయితే, గత ఏడాది జరిగిన హత్యలతో రగిలిపోతున్న ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్ ను దారుణంగా నరికి హత్య చేశారు.
కందనాతిలో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో రెండు విడతలుగా 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి ట్రాక్టర్, రెండు బైక్ లు, రెండు ఇనుప గడ్డపారలు, ఒక ఇనుప రాడ్, రెండు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఇంటి దగ్గర నీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణ గ్రామంలో నలుగురి హత్యకు దారితీసింది. ఏడాదిగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినా హత్యలు జరిగాయి. ఎమ్మిగనూరు జాతరకు బందోబస్తులో పోలీసులు ఉండగా ఇదే అవకాశంగా చెలరేగి హత్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.