కొన్ని వార్తాపత్రికలకు చెందిన విలేకరులను ఉద్దేశించి కర్నూలు మేయర్ బీవై రామయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే.. వీపులు వాయగొడతామని హెచ్చరించారు. ‘సామాజిక న్యాయభేరి’ సభలో మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని ప్రజలు నీడ చాటుకు వెళ్లారని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీసి సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహించారు. అలాంటి తప్పుడు వార్తలు రాసిన వారి వీపులు వాయగొడతామని అన్నారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉండే పాత్రికేయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మేయర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పాలని సూచించారు. వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని.. ఒకవేళ అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరించో లేక బ్రతిమాలో జనాల్ని తెచ్చుకున్నా, అసలు సమయానికి పారిపోతున్నారని లోకేష్ అన్నారు. ‘ఇదే విషయాన్ని వివరిస్తూ వాస్తవాలు రాసేవారిని, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా! ఇదేం రౌడీయిజం?’ అని నిలదీశారు. అధికారంలో వున్నాం కదా అని మత్తులో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయని హెచ్చరించారు. మీ వీపులు ఎప్పుడెప్పుడు మోగిద్దామా అంటూ నాలుగు కోట్లకి పైగా వున్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారని నారా లోకేష్ వెల్లడించారు.