NTV Telugu Site icon

Jana Sena: జనసేన వినూత్న నిరసన.. జూదం, గుండాట, పేకాట మాకొద్దు..!

Untitled 1

Untitled 1

Jana Sena: జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక్కడ కొన్ని కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. మా అప్పాపురం గ్రామంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఆటలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో మందెపు రాయుళ్లు, నేర చరిత్రగలవారు వస్తుంటారని విమర్శించారు.

Read Also: Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. తల్లితో ప్రియాంక.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం

మా అంపాపురం గ్రామం జాతీయ రహదారి వెంబడి ఉండటం వలన జూదం ఆడేందుకు వేళల్లో కార్లు, బైకుల్లో వచ్చి జాతీయ రహదారిపై భారీగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలగిస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్‌.. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. చుట్టూ ఉన్న పంట పొలాల్లో మద్యం సేవించి మద్యం బాటిళ్లు పగలగొట్టి పొలాలలోకి విసరిస్తున్నారు, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మేం సంప్రదాయకంగా నిర్వహించే కోడిపందాలకు వ్యతిరేకం కాదు… కానీ, మా ఊర్లో పేకాట, గుండాట, హింసాత్మక పందాలు నిర్వహించవద్దని ఎస్పీ, డీఎస్పీ , వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో, టీడీపీ కేంద్ర కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి రోజున, ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిరసన తెలియజేస్తున్నాం.. గత సంవత్సరం నిర్వహించిన పందాలలో మా ఊరు యువకుల్ని కొంతమంది కొట్టి దౌర్జన్యంగా ఫోన్‌లు లాక్కుని హింసించారు.. దయచేసి పేకాట, గుండాట, హింసాత్మక కోడిపందాలు మా అంపాపురం గ్రామంలో నిర్వహించవద్దని గ్రామస్తులందరం కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్.

Show comments