Perni Nani: కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పులు వచ్చినా కూడా మంత్రి కొల్లు రవీంద్రకు మించి ఎవ్వరూ లేరన్నట్లుగా కమిషనర్ వ్యవహరించిన తీరు కనిపిస్తోందని విమర్శించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జాగ్రత్త, జైలుకు పంపుతా అని హెచ్చరించారంటే.. కమిషనర్ ఎంత పొగరుగా వ్యవహరించారో అర్థమవుతోంది అన్నారు.
మంత్రి కొల్లు రవీంద్రపై అవినీతి ఆరోపణలు వస్తేనే కమిషనర్ చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు పేర్ని నాని. మీ మంత్రి పదవి పోతే ACBకి ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా? మంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. అధికారుల్ని ఉద్దేశించి, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు.. పాలేరుల్లా పని చేయొద్దు. బ్రిటిష్ కాలంలో తొత్తులుగా మారిన వాళ్లను ప్రజలు ఏం చేశారో గుర్తుంచుకోండి. రేపు ప్రజలే మీలాంటి అధికారుల్ని పీకేస్తారు అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ బరితెగించారు. లోకేష్ ‘99 రూపాయలు కాదు, అర్ధరూపాయికైనా ఇస్తా’ అని మాట్లాడటం సిగ్గుచేటు అని నిలదీశారు.. హెరిటేజ్ ఆస్తులు రూపాయికి ఇస్తారా? లోపల ప్రొడక్ట్స్ పావలాకు ఇస్తారా? ప్రజల సొమ్ము పంచుకుని తినేస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే, నదీ పరివాహక ప్రాంతాల్లో వేలకోట్లు ఖర్చు చేసి మునిగిపోయే నిర్మాణాలు కట్టడం కన్నా.. విజయవాడ–గుంటూరు మధ్య నిర్మిస్తే ప్రజలే ఇళ్లు నిర్మించుకుంటారు అని జగన్ చెప్పారు. అభివృద్ధి గురించి మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తున్నారు అన్నారు పేర్ని నాని.. అమరావతిలో వర్షాలు వస్తే తుమ్మ చెట్లు తీసేయడానికి, నీళ్లు తోడేయడానికి వందలకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొనుగోలు చేస్తామంటున్నారు. అదే నిధులతో సరైన ప్రదేశంలో నిర్మాణాలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని జగన్ చెప్పారు. కానీ ప్రభుత్వానికి అభివృద్ధి కంటే ప్రచారమే ఎక్కువ అని విమర్శించారు. చివరగా, జగన్ మాట్లాడితేనే నోరు తెరుస్తారు.. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్ధాలు మాట్లాడితే నోరు మెదపరు. ప్రభుత్వానికి ప్రజలే వాతలు పెట్టే రోజు దగ్గరలో ఉంది. ప్రజల ఆస్తులపై మదంతో మాట్లాడే వారికి జనం తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని..