NTV Telugu Site icon

Anna Canteen: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం.. ఫుడ్‌ మెనూ.. టైమింగ్స్‌ ఇవే..

Anna Canteen

Anna Canteen

Anna Canteen: బుక్కుడు బువ్వ కోసం ఎవరూ అలమటించకూడదు.. తక్కువ ధరతోనూ అందరికీ టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.. ఇక, అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు.. సామాన్యులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అయితే, 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను నిర్వహించారు.. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి వైసీపీ.. వాటిని మూసివేసింది.. ఇక, అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. పేదోడికి మళ్లీ పట్టెడన్నం అందిస్తోంది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా.. భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు..

Read Also: Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..

క్యాంటీన్ల టైమింగ్స్‌.. మెనూ విషయానికి వస్తే..
* సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కింద ఇడ్లీ-చట్నీ/పొడి, సాంబార్‌ అందించనున్నారు.. ఇక, సోమవారం, గురువారం ఇండ్లీతో పాటు పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్‌-చట్నీ అందుబాటులో ఉంచేలా ప్లాన్‌ చేశారు..
* సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీరోజు మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందుబాటులో ఉంచనున్నారు..
* ఆహార పరిమాణం విషయానికి వస్తే.. ఇడ్లీ లేదా పూరి 3, ఉప్మా, పొంగల్‌ 250 గ్రాములు, అన్నం 400 గ్రాములు, చట్నీ 15 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్‌ 150 గ్రాములు, మిక్చర్‌ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
* ఉదయం 7.30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు టిఫిన్స్‌ అందుబాటులో ఉంటాయి..
* మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు..
* రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి భోజనం అందించేలా టైమింగ్స్‌ ఫిక్స్‌ చేశారు..
* ఉదయం టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం.. ఏదైనా ఐదు రూపాయలకే అందించనున్నారు.