Site icon NTV Telugu

Kodali Nani: చంద్రబాబు నరరూప రాక్షసుడు.. నూటికి నూరు శాతం ఆయన పిచ్చితోనే మరణాలు..!

Kodali Nani

Kodali Nani

కందుకూరులో ఎనిమిది మంది మృతిచెందిన ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు మరింత పెరిగాయి.. ఇప్పుడు గుంటూరులో కూడా మరో ముగ్గురు ప్రాణాలు విడవడంతో.. మరోసారి అధికార పార్టీ నేతలకు టార్గెట్‌ అయ్యారు చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని విమర్శించారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం చంద్రబాబు.. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు, చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు కొడాలి నాని.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మొదలు ,చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్దున్నవాళ్లు ఎవరూ వెళ్లరని వ్యాఖ్యానించారు కొడాలి నాని.. తమనేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారని.. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చి తోనే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసు, స్వయంగా ఆయన గెలవడం కల అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. కాగా, గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version